విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా ? బొటనవేలి గాయంపై స్పందించిన కెప్టేన్
కోహ్లీకి గాయం.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా అని సందేహాలు
వెస్టిండిస్‌తో జరిగిన చివరి వన్డేలో లక్ష్య ఛేదనలో భాగంగా 27 ఓవర్‌లో కీమర్ రోచ్ వేసిన బంతిని ఎదుర్కోబోయిన విరాట్ కోహ్లీ కుడి చేతి బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. గాయంతో అల్లాడిపోయిన కోహ్లీకి వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించిన అనంతరం రెచ్చిపోయాడు. గాయంతోనే బ్యాటింగ్ చేయడంతోపాటు సెంచరీ సాధించి జట్టును విజయపథంలోనూ నడిపించాడు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ వచ్చే వారం జరగనున్న టెస్ట్ మ్యాచ్‌పై ఈ గాయం ప్రభావం చూపనుందా ? బొటన వేలి గాయం కారణంగా కోహ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడగలడా లేదా అనే సందేహాలే ప్రస్తుతం టీమిండియా అభిమానులను వేధిస్తున్నాయి.
అయితే ఇదే విషయమై కోహ్లీ స్పందిస్తూ.. అదృష్టవశాత్తు తనకు పెద్ద గాయమేమీ అవలేదని పేర్కొన్నాడు. "అదృష్టం కొద్ది ఫ్రాక్చర్ అవ్వలేదు. ఇది చిన్నగాయమే కనుక తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడగలను" అంటూ తనపై తనుకున్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. వెస్టిండీస్‌తో చివరి వన్డే విజయం అనంతరం తన బొటనవేలి గాయంపై స్పందిస్తూ విరాట్ కోహ్లీ ఈ క్లారిటీ ఇచ్చాడు. కోహ్లీ చెప్పిన సమాధానంతో అతడి అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఆంటిగ్వేలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి 26వ తేదీ వరకు ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా అంతకన్నా ముందుగా ఆగస్టు 17 నుంచి 19 వరకు కూలిజ్ క్రికెట్ గ్రౌండ్‌లో మూడు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.