ట్రినిడాడ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత వెస్టిండీస్ జట్టు కెప్టేన్ జాసన్ హోల్డర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 1.3 ఓవర్ల వద్ద వరుణుడు అడ్డం పడటంతో కాసేపు మ్యాచ్‌ను ఆపేశారు. వర్షం వెలిసిన అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. 22 ఓవర్ల వద్ద మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి విండీస్ 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించగా విండీస్ జట్టు 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ విజయ లక్ష్యాన్ని 255 పరుగులుగా ఎంపైర్లు నిర్ణయించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 32.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్టయింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా ఆ తర్వాతి రెండు వన్డేల్లోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ 99 బంతుల్లో 114 పరుగులు చేసి వన్డేల్లో 43వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 65 పరుగులు చేసి టీమిండియా విజయంలో మరో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ ఓపెనర్లు క్రిస్ గేల్ 41 బంతుల్లో 72 పరుగులు చేయగా, ఎవిన్ లూయిస్ 29 బంతుల్లో 43 పరుగులు చేశారు. క్రిస్ గేల్ ఔట్ అయిన అనంతరం ఇదే అతడి కెరీర్లో చివరి వన్డే కావడంతో టీమిండియా ఆటగాళ్లు అంతా గేల్‌ని అభినందిస్తూ వీడ్కోలు పలికారు.