Bandi Sanjay: కేసీఆర్ అబద్దాల చిట్టా పేరిట పోస్టర్లను విడుదల చేసిన బండి సంజయ్
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Bandi Sanjay to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలను గుర్తుచేసిన తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కేసీఆర్ ఆ హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగడుతూ '' కేసీఆర్ ఝూఠా మాటలు'' పేరిట రూపొందించిన పోస్టర్లను పార్టీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డిలతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మర్రిగూడలోని బీజేపి క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఝూఠా మాటల కేసీఆర్, ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా అంటూ మీడియాకు పోస్టర్లు విడుదల చేశారు. మనుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి పచ్చి అబద్దాలు చెప్పి ఓటర్లను మోసగించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. తప్పుడు హామీలతో ఉప ఎన్నికలో గెలవాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. మందు, మాంసం, మనీని వెదజల్లి ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నందున కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకోసం ఝూఠా మాటల కేసీఆర్ పోస్టర్లను ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా మాధ్యమల్లో ప్రచారం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.