తెలంగాణలో కొనసాగుతున్న ఆపరేషన్ లోటస్ ; రెబల్ నేతలపై బీజేపీ గురి
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ లోటస్ కొనసాగుతుంది. రాష్టంలోని బడా నేతలను వలవేసే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండానే నేరుగా పార్టీ హైకమాండ్..రెబల్ అభ్యర్ధులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
నేతల జాబితా ఇదే...
బీజేపీ నిర్వహిస్తున్న ఆపరేషన్ లోటస్ లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత డీకే అరుణకు గాలం వేసిన కమలనాథులు.. మరింత మంది బడానేతలను ఆకర్షించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది .ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో మహిళా నేత సునీతా లక్ష్మారెడ్డికి సంప్రదించినట్లు తెలిసింది. ఎంపీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆమె... బీజేపీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అలాగే ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మరో మహిళా నేత రేణుకా చౌదరి లను సంప్రదించినట్లు తెలిసింది.
టీఆర్ఎస్ రెబల్స్ పై బీజేపీ ఆశలు
తెలంగాణలో 16 సీట్లలో గెలుపే టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్ ..అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది సిట్టింగులను పక్కన పెడతారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు అభ్యర్ధులను ప్రకటించేందుకు టీఆర్ఎస్ మూహుర్తం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సీటు దగ్గని అభ్యర్ధులను వలవేసేందుకు బీజీపీ రెడీ గా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.