తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా..!
తెలంగాణలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివారం తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు కె లక్ష్మణ్‌కు రాజా సింగ్ పంపించారు. తాను తొలుత గోసంరక్షణకు పాటు పడే వ్యక్తినని.. ఆ తర్వాతే ఎమ్మెల్యేనని ఆయన అన్నారు. తన గోసంరక్షణ ఉద్యమానికి.. బీజేపీ పార్టీ విధానాలకు కొందరు కావాలనే ముడిపెడుతున్నారని రాజా సింగ్ అన్నారు. అందుకే ఇటు తన ఉద్యమానికి.. అటు పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేయాలని భావిస్తున్నానని ఆయన అన్నారు.
తాను చేస్తున్న ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని ఈ సందర్భంగా రాజా సింగ్ తెలిపారు. తెలంగాణలో గోసంరక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తామెన్ని ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్రంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాలు ఎక్కువవుతున్నాయని.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం కోసం తాను పార్టీలకతీతంగా పనిచేయాలని భావిస్తున్నానని రాజా సింగ్ తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రాజా సింగ్ అన్నారు.
గతంలో రాజా సింగ్ పై హైదరాబాద్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. మతాలను రెచ్చగొట్టేవిధంగా ఆయన ప్రసంగిస్తుంటారని పలుమార్లు ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పార్టీ తరఫున విప్‌గా కూడా రాజా సింగ్ పనిచేశారు. హైదరాబాద్ ధూల్ పేట ప్రాంతంలో నివసించే రాజా సింగ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా తన కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత పార్టీలో చేరారు. లోథా క్షత్రియ కమ్యూనిటీకి చెందిన రాజా సింగ్ కుటుంబంతో సహా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.