BRS Posters: బీజేపీపై విమర్శలు పెంచిన బీఆర్ఎస్, దాడులపై నగరంలో వ్యంగ్య పోస్టర్లు
BRS Posters: హైదరాబాద్‌లో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొత్త యుద్ధం ప్రారంభమైంది. ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల నేపధ్యంలో బీఆర్ఎస్ ప్రదర్శించిన వ్యంగ్య పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీలో చేరితే ఎలాంటి దాడులుండవనే విధంగా పోస్టర్లు వెలిశాయి.
తెలంగాణ మంత్రుల ఇళ్లపై జరిగిన ఐటీ దాడులు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబీఐ విచారణ నేపధ్యంలో బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పెంచేసింది. ఇందుకు సాక్ష్యంగానే హైదరాబాద్‌లో వెలిసిన ఈ పోస్టర్లు. అసలీ పోస్టర్లలో ఏముందో తెలుసుకుందాం..
మా పార్టీలో చేరితే కేసులుండవు, ఐటీ రైడ్స్ ఉండవు, సీబీఐ , ఈడీ దర్యాప్తుల్నించి ఉపశమనం ఉంటుంది. ఇది బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీలకు ఇస్తున్న ఆఫర్ అట. ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకిచ్చే ఆఫర్‌లానే ఉంది కదూ. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన పురస్కరించుకుని నిన్న టైడ్ ప్యాకెట్ మోడల్‌తో రైడ్ పేరుతో పోస్టర్లు, ఇవాళ నిర్మా పేరుతో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరితే కేసులు మాఫీ అనే అర్ధం వీటిలో దర్శనమిస్తుంది. అంతేకాదు..ఈ పోస్టర్లలో సుజనా చౌదురి, సువెందు అధికారి, జ్యోతిరాదిత్య సింథియా, బిశ్వశర్మ, నారాయణ్ ఠానే వంటి నేతల ఫోటోలున్నాయి.
ఈ నేతలంతా బీజేపీలో చేరాక అప్పటివరకూ వారిపై జరిగిన రైడ్స్ ఆగిపోయాయని పోస్టర్ల ద్వారా బీఆర్ఎస్ విమర్శలు సంధించింది. ఓ వైపు అమిత్ షా పర్యటన, మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఓ స్థాయిలో ఎటాక్ చేస్తోంది. బై బై మోదీ అంటూ నినాదాలు దర్శనమిస్తున్నాయి. ఈడీ రైడ్స్‌ను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. రాత్రికి రాత్రి వెలసిన ఈ పోస్టర్లు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి.
మరోవైపు ది డిస్ట్రాయర్ ఆఫ్ డెమోక్రసీ పోస్టర్ మోదీ బొమ్మతో ఈసీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ, ఈసీ ఇలా పది ముఖాల అవతారాలతో రావణుడి పోస్టర్ మరో ఆకర్షణగా నిలిచింది.
సుజనా చౌదరి, సువేందు అధికారి వంటి నేతలు కాషాయ రంగు పులుముకోవడం ద్వారా దాడుల్నించి ఉపశమనం పొందారనే అర్ధం వచ్చేలా పోస్టర్లు డిజైన్ చేశారు. అదే పోస్టర్‌లో ట్రూ కలర్స్ నెవర్ ఫేడ్ అంటూ ఎమ్మెల్సీ కవిత ఫోటోనూ ముద్రించారు. అసలు సంగతేమో గానీ క్రియేటివిటీ మాత్రం చాలా బాగుంది. అందర్నీ ఆకర్షిస్తోంది.
Also read: MLC Kavitha: ఊహగానాలకు చెక్.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook