రైతుబంధు పథకానికి కరీంనగర్ నుంచి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన తేదీన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 10వ తేదీన తేదీన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే. 'రైతు బంధు' కార్యక్రమం సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు 'రైతుబంధు' పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో సీఎం తెలిపారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయాలని, మంచి నీటి సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాస్ పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాల వారిగా పంపించాలని, ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో స్థానికంగా అందరికీ తెలపాలని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు అధికారులు కార్యక్రమం జరిగే రోజుల్లో గ్రామాల్లో పర్యటించి పర్యవేక్షించాలని సీఎం అన్నారు.
గవర్నర్‌తో సీఎం భేటీ
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 10వ తేదీన ప్రారంభయ్యే రైతుబంధు చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్.. గవర్నర్‌ను ఆహ్వానించారు. ఏదైనా ఒక జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను సీఎం కోరారు.