సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బలగాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బుధవారం ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్‌కు తరలించారు. నల్లగొండ జిల్లా వలిగొండకు చెందిన వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యపై ఏసీపీ నారాయణ స్పందిస్తూ.. మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడని, గతంలోనే ఇతనిపై పలుమార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయని అన్నారు. నార్కట్‌పల్లిలోని కామినేని డి-అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నప్పటికీ అతడి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదని ఏసిపి తెలిపారు. వెంకటేశ్వర్లుపై ఒకసారి సస్పెన్షన్ వేటు వేసినట్టు గుర్తుచేసుకున్న ఏసీపి.. వారం క్రితం సైతం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెచ్చరించామని వెల్లడించారు. అయితే, తన భర్తను క్షమించి తిరిగి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర్లు వేడుకోవడంతో మళ్లీ అతడిని విధుల్లోకి తీసుకున్నామని ఏసీపీ నారాయణ స్పష్టంచేశారు.