నారాయణ్‌పేట్‌: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నారాయణ్‌పేట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటే భయమని, అందుకే ఆయన తెలంగాణలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం లేదని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే, సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపిస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే వేదికపై నుంచి కాంగ్రెస్ పార్టీపై సైతం విమర్శలు చేసిన అమిత్ షా మహాకూటమిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మసీదులు, చర్చిలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ  మరి దేవాలయాలను ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. మొత్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి మైనార్టీలకు కొమ్ముకాసేవిగా ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు.