హైద‌రాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వగా లోక్ సభ ఎన్నికలతోపాటే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిపై స్పందించిన ఎన్నికల సంఘం.. లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత తలెత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరమే విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి షరతు విధించింది.


లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసేలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న ఇసి ఇవాళ దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 24న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండగా మే 20 లోపు ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.