Electricity Production With Cow Dung: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్‌ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్‌తో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు మున్సిపల్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆవు పేడతో కరెంట్ తయారీపై జీ తెలుగు న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్యావరణ రక్షణ లక్ష్యంగా పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును వేములవాడ రాజన్న గోశాలలో నిర్మిస్తున్నారు. రాజన్న గోశాలలో ఉండే  కోడె ఆవుల పేడతో బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కానుంది. జిల్లా మంత్రి కేటీఆర్ సూచన మేరకు రాజన్న అలయ నిధుల ద్వారా 31.60 లక్షల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా జూన్ 1 లోగా పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బయోగ్యాస్ ద్వారా వచ్చే విద్యుత్ ను ఏరియా ఆసుపత్రితో పాటు రాజన్న ఆలయానికి వినియోగించనున్నారు.


బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో నిర్మిస్తున్నారు. అయితే రోజూ 2.5 టన్నుల పశువుల పేడను దీనికి వినియోగించనున్నారు. మూడు ప్రక్రియల ద్వారా పశువుల పేడ గ్యాస్ ఆధారిత ప్లాంటులోకి ద్రవ రూపంలో చేరుతోందనీ కెమికల్ రియాక్షన్ ద్వారా వచ్చే గ్యాస్ ను జనరేటర్ కు అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయనున్నారు. రోజూ 32 కెవి ల విద్యుత్తు ఉత్పత్తి జరగనుందన్నారు. పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్తును ఏరియా ఆసుపత్రితో పాటు ఆలయ అవసరాలు కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దీని ద్వారా వచ్చే గ్యాస్ తో కూడా అవసరమైతే వంట అవసరాలకు కూడా వాడుకోవచ్చు అని తెలిపారు.


బయోగ్యాస్ కోసం వినియోగించే పేడ నుంచి వచ్చే వ్యర్ధాలు కూడా తిరిగి సేంద్రీయ ఎరువులుగా వాడుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా స్టోరేజీ ట్యాంకు కలిగి ఉంటుందని దాని నుండి తీసుకొని పంటలకు ఎరువుగా వాడుకోవచ్చు అని అధికారులు వివరించారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా సేంద్రియ ఎరువుగా మారుతుంది అని చెబుతున్నారు.