యాదాద్రి భువనగిరి: గ్రామాల ప్రగతి ప్రణాళికలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పర్యటించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. 'ఆశించిన రీతిలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పని చేయలేదు' అని అసంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామాన్ని చూశాకా.. అసలు కలెక్టర్, ఎమ్మెల్యే ఈ గ్రామాన్నే ఎందుకు ఎంచుకున్నారో తనకు అర్ధం కావడం లేదని మంత్రి విస్మయం వ్యక్తంచేశారు. ''30 రోజుల్లో మరోసారి వస్తానని... అప్పటిలోగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి'' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసి, స్థానిక అధికారులకు సూచించారు. మాసాయిపేటలో రూ.2,00,60,000 వ్యయంతో నిర్మించనున్న 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలం పరిధిలోని గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఆదివారం నీళ్లు విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి కేసీఆర్‌ సంవత్సరానికి రూ.39లక్షలు విడుదల చేస్తున్నారని చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.. ప్రస్తుతానికి రూ.5 లక్షలు విడుదలయ్యాయని తెలిపారు. 


ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి.. గ్రామంలో ప్రతి కార్యక్రమం సర్పంచ్‌ ఆధ్వర్యంలోనే జరగాలని, ప్రతి మూడు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్‌ సర్పంచ్‌లకు దేశంలోనే గొప్ప అవకాశాలు కల్పించారు' అని అన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.