తెలంగాణ శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ రోజుతో పూర్తి కానుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండీ  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. నామినేషన్లు అనగానే ప్రజా ప్రతినిధులు ముహుర్తాలు పెట్టుకొని మరీ వస్తుంటారు. ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముహుర్తాన్నే అనుసరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలువురు నేతలు ఇప్పటికే నామినేషన్లు సమర్పించారు. ఇంకా కొందరు సమర్పించాల్సి ఉంది. అలాగే బీఫారాలు ఇవ్వకుండా నామినేషన్లు దాఖలు చేసినవారు కూడా ఈ రోజు బీఫారాలు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్లను మొత్తం స్వీకరించాక.. 21,22 తేదిల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి కూడా ఎన్నికల సంఘం గడువు ఇస్తుంది. నామినేషన్లు సమర్పించి కూడా... పోటీ చేయకూడదని భావించేవారు ఈ గడువులో తమ వాటిని ఉపసంహరించుకోవచ్చు.


ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు ఈ రోజు నుండి నియోజకవర్గాలకు రావడం జరుగుతుంది. అలాగే ఓటర్ల అనుసంధాన జాబితాను కూడా ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అక్టోబరు 12వ తేదీన ఓటర్ల ఫైనల్ జాబితాను  ప్రకటించిన ఎన్నికల సంఘం తగిన అర్హత కలిగిన పౌరులు ఓటర్లగా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు అవకాశం కల్పించడం గమనార్హం. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలలో లక్షా యాభై వేల వరకు కొత్త ఓటర్లకు  ఓటు వేసే అవకాశం దక్కుతోంది.