FIR Filed Against Minister Srinivas Goud: హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పేర్కొని ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు అనే ఫిర్యాదుపై మహబూబ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తోపాటు మరో ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కి సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 10 మంది అధికారులపై సైతం మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. 2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్‌ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ వాస్తవాలు వెల్లడించకపోగా అఫిడవిట్ లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లాకే చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు హైదరాబాద్‌ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పై రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇదే ఘటనతో సంబంధం ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 10 మంది అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశిస్తూ జులై 11న మహబూబ్ నగర్ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా రాఘవేంద్ర రాజు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి సెప్టెంబరు 11లోగా పూర్తి నివేదిక కోర్టుకు అందించాలని తమ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. 


అయితే, మహబూబ్ నగర్ పోలీసులు కోర్టు ఆదేశాల ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయకపోవడంతో మంత్రి నుండి మంత్రి అనుచరుల నుంచి తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదు చేస్తూ రాఘవేంద్ర రాజు ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 11 గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయకుండా కోర్టు ఉత్తర్వులను పోలీసులు బేఖాతరు చేస్తున్నారని రాఘవేంద్ర రాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


రాఘవేంద్ర రాజు పిటిషన్ పై శుక్రవారం వాదనలు విన్న ప్రజాప్రతినిధుల న్యాయస్థానం.. సాయంత్రంలోగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తాము ఆదేశించిన విధంగా మరో 10 మంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు వివరాలు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు తీర్పు ఉల్లంఘన కింద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తూ మహబూబ్ నగర్ పోలీసులపై కోర్టు మొట్టికాయలేసింది. దీంతో ఆలస్యంగా తేరుకున్న పోలీసులు ఇక చేసేదేం లేదన్నట్టుగా మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో పది మంది అధికారులపై కేసు నమోదు చేసి ఆ వివరాలను కోర్టుకు అందజేశారు.