Etela Rajender : ఒక్క హుజురాబాద్ ఉపఎన్నిక ఓటమికే సీఎం కేసీఆర్ (Kcr) దిమ్మతిరిగిపోయిందన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నారు. అందుకే రోజుకు రెండేసి గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంత గొంతు చించుకున్నా... ప్రజలు ఆయన మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. బుధవారం(నవంబర్ 10) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఈటల రాజేందర్ (Etela Rajender) మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కేసీఆర్ ఏది చెబితే అదే చట్టంగా అమలవుతోందని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న స్వేచ్చ కూడా ఇప్పుడు కరువైందన్నారు. సమైక్య రాష్ట్ర శాసనసభలో (Assembly) ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు స్వేచ్చగా అమలయ్యాయని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్స్ కాలరాశారని ఆరోపించారు. తన రాజీనామాపై చర్చ జరిగితే కేసీఆర్ బండారం, నైజం బయటపడుతుందనే ఉద్దేశంతో దానిపై ఎక్కడా జరగకుండా చేశాడని మండిపడ్డారు.


తన రాజీనామాను స్వయంగా స్పీకర్‌కు అందజేయాల్సి ఉన్నా... ఆ అవకాశం కూడా కేసీఆర్ లేకుండా చేశారని ఆరోపించారు. చివరకు శాసనసభలో సెక్రటరీ ద్వారా తన రాజీనామా పత్రాన్ని తీసుకున్నారని... ఇది తననే కాదు, రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతూ నిజమైన ఉద్యమకారుల కళ్లల్లో కేసీఆర్ మట్టి కొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నైజం అర్థమయ్యాక కూడా నిజమైన ఉద్యమకారులు ఇక ఆయన వెంట నడవద్దన్నారు. ప్రజాప్రతినిధులు,ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారు,స్వేచ్చను కోరేవారు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమంటున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ యావత్ సమాజం కేసీఆర్ (Kcr) అహంకారాన్ని చెంప చెల్లుమనిపించే రోజు వస్తుందన్నారు.


Also Read:


హుజురాబాద్‌ ఉపఎన్నికలో తనను ఓడగొట్టడానికి రూ.600 కోట్లు అక్రమ సంపాదన ఖర్చు పెట్టారని ఆరోపించారు. రూ.2500 కోట్లతో దళిత బంధు ప్రకటించారని పేర్కొన్నారు. ఇంత చేసినప్పటికీ ఉపఎన్నికలో కేసీఆర్‌కు దిమ్మతిరిగిపోయిందన్నారు. ఒక్క హుజురాబాద్ ప్రజల తీర్పుకే దిమ్మతిరిగిపోతే రేపు తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు సిద్దంగా ఉండాలన్నారు. ఇకనైనా విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ టక్కు టమారా విద్యలను అర్థం చేసుకొని మేల్కొనాలన్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.