10 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కేబినెట్, ముహూర్తం ఫిక్స్ ?
10 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కేబినెట్, ముహూర్తం ఫిక్స్ ?
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా ? కేబినెట్‌లో ఎవరెవరికి, ఎంతమందికి అవకాశం కల్పించాలి ? ఎవరెవరిని పక్కన పెట్టాలనే అంశంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓ స్పష్టతకు వచ్చేశారా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం.. ఈ నెల 31వ తేదీన కానీ లేదా వచ్చే నెల 10న కానీ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు మెండుగా వున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి కేబినెట్‌లో కేవలం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నెలన్నర పూర్తయినా ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కేబినెట్ ఏర్పాటుపై అనేక పుకార్లు షికార్లు చేశాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే, ఇటీవల చండీయాగంతో బిజీబిజీగా గడిపేసిన ముఖ్యమంత్రి ఇక కేబినెట్ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జనవరి 31, ఫిబ్రవరి 10 తేదీల్లో బలమైన ముహూర్తం ఉన్నందున ఈ రెండు తేదీలలో ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతానికి ఓ 10 ఎమ్మెల్యేలతో కేబినెట్ ఏర్పాటు చేసి, లోక్ సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురుని కేబినెట్‌లోకి తీసుకునే వ్యూహంలో కేసీఆర్ ఉన్నారనేది ఆ కథనాల సారాంశం.
ఇంతకుముందు అవకాశం పొందిన పలువురు సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వకుండా.. యువతకు లేదా రెండు, మూడుసార్లు గెలిచిన నేతలకు అవకాశం ఇస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారని, పక్కకుపెట్టిన సీనియర్లను అవసరమైన చోట లోక్ సభ ఎన్నికల బరిలో దింపాలని అనుకుంటున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్న ఆశావహులంతా ఎప్పుడెప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.