తెలంగాణ ఎన్నికలు: కేసీఆర్ నామినేషన్‌కు ముహుర్తం ఖరారు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఈ నెల 14వ తేదిన నామినేషన్ వేయడానికి ముహుర్తం ఖరారైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఈ నెల 14వ తేదిన నామినేషన్ వేయడానికి ముహుర్తం ఖరారైంది. కోనాయిపల్లి వెంకన్న ఆలయానికి వెళ్లి అక్కడి మొక్కు తీర్చుకొని ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరనున్నారు. ఆలయంలో ఉండగానే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయడానికి ఆయన నిశ్చయించుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల 34 నిముషాలకు ఆయన నామినేషన్ వేయడానికి ముహుర్తం ఖరారు అయ్యింది. గజ్వేల్‌లోని ఆర్డీవో కార్యాలయానికి వచ్చి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.
1985 నుండి ప్రతీ ఎన్నికలప్పుడూ కూడా కేసీఆర్ ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం యాత్ర చేపట్టినప్పుడు కూడా కేసీఆర్ కోనాయిపల్లి వెంకన్నకు మొక్కే ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా.. కేసీఆర్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కోనాయిపల్లి వెంకన్న కేసీఆర్ ఇష్టదైవం. కేసీఆర్‌తో పాటు మరో తెలంగాణ రాష్ట్రమంత్రి హరీష్ రావు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు రేపే మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటలలోపు నామినేషన్ వేయడానికి ముహుర్తం ఖరారైంది. కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని సిద్ధిపేట పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. కేసీఆర్ హెలికాప్టర్ ద్వార కోనాయిపల్లికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ ప్రాంతానికి వెళ్లే రహదారిలో హెలీ ప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ దిగాక.. కారులో కేసీఆర్ కోనాయిపల్లి వచ్చి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.