రూ.కోటి 10 లక్షలు లంచం కేసులో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju Committed Suicide) చేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో మరో ఆత్మహత్య సంచలనం రేపుతోంది. రూ.1 కోటి 10 లక్షల లంచం కేసులో అరెస్టయి, కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



 


భారీ లంచం కేసులో కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీకి చెందిన ధర్మారెడ్డి సైతం అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. 33 రోజులపాటు జైలులో ఉన్న ధర్మారెడ్డికి బెయిల్ రావడంతో ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. కేసులో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లిరావడంతో మానసిక ఆవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో కుషాయిగూడ వాసవి శివ నగర్ కాలనీలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.




కాగా, కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు సహాయంతో 24 ఎకరాల 16 గుంటల భూమిని తన బంధువుల పేరు మీద పాస్ బుక్‌లు తయారు చేయించారని ధర్మారెడ్డిపై ఏసీబీ ఆరోపిస్తోంది. రాంపల్లి గ్రామంలోని ఆ భూమి విలువ దాదాపు రూ.48 కోట్లుగా ఉందని సమాచారం. ఈ కేసులో ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా అరెస్టయి జైలు పాలయ్యాడు. 



 


వివాదాస్పద స్థలంపై ఆర్డీవో కార్యాలయంలో పెండింగ్ ఉన్నప్పటికీ.. కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజుతో చేతులు కలిపి భారీ లంచం ఇచ్చి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారుచేసి భూమి దక్కించుకునే యత్నం చేశారని ధర్మారెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. పది రోజుల కిందట బెయిల్‌‌పై విడుదలైన ధర్మారెడ్డి బలవన్మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe