చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసల జల్లు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. "హైదరాబాద్ ఈ రోజు ఒక ఐటి హబ్‌గా మారడానికి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఈ నగరానికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆయన స్వయంగా బిల్ గేట్స్‌తో మాట్లాడి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించడం విశేషం" అని హైటెక్స్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో కేటీఆర్ తెలిపారు.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబే అని తెలిపారు. 17ఏళ్లలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి గొప్ప సంస్థలు భాగ్యనగరానికి వచ్చాయంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా ఎంతో ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఏపీ రాజధాని అమరావతి కూడా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ఆ సంస్థ సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి, నాస్కామ్ ప్రెసిడెంట్ డేబ్జానీ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.