మహాకూటమిలో కాంగ్రెస్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ లక్షంతో ఏర్పడిన కూటమిలో ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. కూటమిపై నిర్ణయం తీసుకొని 50 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సీట్ల విషయం తేల్చకపోవడం సరైంది కాదని సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న జాప్యంతో ప్రత్యర్ధి టీఆర్ఎస్ లాభపడే అవకాశముందని హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసంబద్ధమైన లీకులు ఇస్తున్న కాంగ్రెస్ తీరుపై తాము అసంతృప్తితో ఉన్నామన్న చాడ.. తమకు ఏమాత్రం ఆమోద యోగ్యంలేని విధంగా కేవలం 2, 3 సీట్లు ఇస్తామని లీకు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లీకుల వల్ల తమ పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటోందన్నారు . వాస్తవానికి ఎవరో ఏర్పాటు చేసిన కూటమిలో తాము చేరాల్సిన అవసరం లేదని.. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలనే ఏకైన లక్ష్యంతో కూటమిలో చేరేందుకు అంగీకరించామన్నారు. 


ఇప్పటికైనా కాంగ్రెస్ తీరు మార్చకొని వెంటనే తమకు న్యాయమైన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరు ఇలాగే కొనసాగితే సురవరం అధ్యక్షతన 4న జాతీయ కార్యవర్గ సమావేశంలో  తమ భవిష్యత్తు కార్యచారణ ప్రకటిస్తామని సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు డెడ్ లైన్ ఇచ్చారు.