Harish Rao Comments: అందుకే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి హరీష్ రావు
Minister Harish Rao On Revanth Reddy: రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతల మాటల దాడి ఇంకా ఆగడం లేదు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చారో.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఇస్తున్నామో ప్రజలను కోరదామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Minister Harish Rao On Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. "రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు 90 శాతం మంది ఉన్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు అన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బోరు బావుల వద్ద మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ అన్నారు.. సోనియాగాంధీ ఉచిత కరెంటుకు వ్యతిరేకం అని కల్వ సుజాత అన్నారు.." అని గుర్తు చేశారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగు, ఐదు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదని.. రైతులకు ఏడు గంటల కరెంటు ఇవ్వలేమని కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు.
"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం పెద్ద జోక్. తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంటు నుంచి.. నాడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. నాడు తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని మొదట స్పందించింది కేసీఆర్. గడ్డి పోచల్లాగా పదవులు వదులుకున్న నాయకుడు కేసీఆర్. మీరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. కరెంటు 24 గంటలు వస్తుందో లేదో కరెంటు తీగలు పట్టుకోండి.
వచ్చే ఎన్నికల్లో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చారో.. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చామో ప్రజల నుంచి రెఫరెండం కోరదాం. కాంగ్రెస్ విధానం మూడు గంటలు.. కేసీఆర్ నినాదం మూడు పంటలు.. బీజేపీ నినాదం మతం పేరిట మంటలు. ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు 24 గంటల కరెంటు కావాలని డిమాండ్ చేస్తున్నారు. 2004లో నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 7 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేమని అన్నారు. తెలంగాణ వచ్చాక అసెంబ్లీలో విద్యుత్ సమస్య ఉందని ఎవరైనా మాట్లాడారా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కరెంటు కోతలు, ఎండిన పంటలపై చర్చలు జరగలేదా..? క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ కట్ చేయలేదా..? ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలను చూసి నవ్వుకుంటున్నారు.. నాడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ వద్దంటే ప్రజలు ఇంటికి పంపించారు" అని మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ కరెంటు మీటర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న దగ్గర డీజిల్ ఇంజన్లు ఉన్నాయన్నారు. ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యాపార కోణంలో చూస్తోందని.. కేసీఆర్ మానవీయ కోణంలో చూస్తున్నారని అన్నారు. నేడు నాణ్యమైన విద్యుత్ వస్తుంది కాబట్టే మోటార్లు కాలడం లేదన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేసీఆర్ 37 వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసులు రాత్రి పూట నక్సలైట్లు అనుకుని రైతులను కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కరెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Yashasvi Jaiswal: వెస్టిండీస్ బౌలర్‌ను బూతులు తిట్టిన యశస్వి జైస్వాల్.. వీడియో వైరల్
Also Read: Twitter Ads Revenue: ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్‌న్యూస్.. మాట నిలబెట్టుకున్న ఎలన్ మస్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి