హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. శుక్రవారం రామగుండం, కామారెడ్డి ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి.. సాయంత్రానికే 75శాతం ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఆదివారం ఉదయం నాటికి తెలంగాణ వ్యాప్తంగా రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 10సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం ఆలస్యమైనా... ఈసారి వర్షాపాతం ఆశాజనకంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్ రెడ్డి తెలిపారు. సగటు వర్షపాతంతో పోల్చుకుంటే 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. 


నైరుతి రుతుపవనాల రాకకు తోడు ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటం వంటి పరిణామాల కారణంగా కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.