Munugode Bypoll :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉండనుంది. అందుకే ప్రధాన పార్టీలు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ బలగాలను మొత్తం మునుగోడులోనే మోహరిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. ఆయన నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. ఆయన సమక్షంలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలాల వారీగా ఆమె కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థి విషయంలో అధికార పార్టీ వ్యూహం మారుతుందని తెలుస్తోంది. మునుగోడుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్న సీఎం కేసీఆర్.. అభ్యర్థి విషయంలో తాజాగా వ్యూహం మార్చారని అంటున్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖరారయ్యారని ప్రచారం సాగింది. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో కూసుకుంట్ల నియోజకవర్గంలోప్రచారం కూడా చేసుకుంటున్నారు. మునుగోడు బహిరంగ సభలోనే కేసీఆర్ ఆయన పేరు ప్రకటిస్తారని భావించారు. కాని అది జరగలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినా టీఆర్ఎస్ లో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. అయితే తాజాగా పీకే టీమ్ చేయించిన సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. రెండు, మూడు రోజుల క్రితం కూడా పీకే టీమ్ తాజా సర్వేలను కేసీఆర్ కు అందించిందని తెలుస్తోంది. అందులో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలుపు ఈజీగా ఉంటుందని పీకే టీమ్ చెప్పిందని సమాచారం. కాంగ్రెస్, బీజేపీ నుంచి రెడ్డి అభ్యర్థులు పోటీ చేస్తున్నందున.. బీసీకి ఇస్తే పోటీనే ఉండదని కూడా స్పష్టం చేసిందట. అందుకే బీసీ అభ్యర్థిని ప్రకటించాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని అంటున్నారు.  


నిజానికి మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 67 శాతం మంది బీసీలే. మరో 24 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. బీసీ ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నా మునుగోడు నుంచి ఇప్పటివరకు బీసీ వర్గం నుంచి ఎవరూ ఎమ్మెల్యే కాలేదు. మునుగోడుకు ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా.. ఎనిమిది సార్లు రెడ్లు.. నాలుగు సార్లు వెలమలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ విషయంలో బీసీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. బీసీలకు టికెట్ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా జరిపారు. కుసుకుంట్లకు టకెట్ ఇస్తే పనిచేసేది లేదని కూడా కొందరు ప్రకటించారు. ఇవన్ని పరిశీలించిన పార్టీ హైకమాండ్.. బీసీని బరిలోకి దింపాలని డిసైడ్ అయిందంటున్నారు. బీసీకి టికెట్ ఇస్తే మెజార్టీ వర్గాలకు మద్దతుగా ఉండటంతో పాటు కూసుకుంట్ల వ్యతిరేక వర్గం కూడా కూల్ అవుతుందన్నది కేసీఆర్ లెక్కగా చెబుతున్నారు.


బీసీకి ఇస్తే టికెట్ ఎవరికి వస్తుందన్నది ఆసక్తిగా మారింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శాసనమండలిలో ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ మునుగోడు నుంచి టికెట్ ఆశించారు. మునుగోడు నియోజకవర్గంలో గౌడ్, యాదవ్, పద్మశాలి, ముదిరాజ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నలుగురు టికెట్ అశించినా కేసీఆర్ పరిశీలనలో మాత్రం బూర నర్సయ్య గౌడ్. కర్నె ప్రభాకర్ పేర్లు ఉన్నాయంటున్నారు. నియోజకవర్గంలో గౌడ్ లు బలంగా ఉండటంతో నర్సయ్య తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కర్నె ప్రభాకర్ సామాజిక వర్గం తక్కువగా ఉన్నా.. ఆయన సతీమణి పద్మశాలి. అందుకే కర్నె కూడా తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఇద్దరు కూడా ఉద్యమకారులే. డాక్టర్స్ జేఏసీ చైర్మెన్ గా బూర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఇక కర్నె ప్రభాకర్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఎన్నో సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చినట్లేననే చర్చ కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్దల్లో ఉందని తెలుస్తోంది.


కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందన్న ప్రచారం తెరపైకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొంత దూకుడు తగ్గించారు బీసీ నేతలు. మంత్రి జగదీశ్ రెడ్డి తమను కావాలనే దూరం పెడుతున్నారని బహిరంగగానే కామెంట్లు చేశారు.
అయితే తాజాగా సీన్ మారిపోవడంతో బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ లు మళ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బీహార్ నుంచి తెప్పించిన తాటి విత్తనాలను మునుగోడులో పంపిణి చేశారు నర్సయ్య గౌడ్. అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం టీఆర్ఎస్ కుటుంబం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మండలాల వారీగా  సమావేశాలు నిర్వహిస్తున్నారు.


Also Read:  TARGET KCR FAMILY: ఈడీ చేతిలో కేసీఆర్ ఫ్యామిలీ బినామీల చిట్టా? బడాబాబుల అరెస్ట్ తప్పదా?


Also Read:  Rid Constipation, Acidity In 1 Day: మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కేవలం 1 రోజులో ఈ విత్తనాలతో చెక్‌ పెట్టొచ్చు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok