ఢిల్లీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె అనంతరం సమ్మెలో పాల్గొన్న 48,000 మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయపరమైన డిమాండ్లతో నోటీసులు ఇచ్చి మరీ సమ్మె చేస్తోన్న తమను ఏ కారణంతో ప్రభుత్వం డిస్మిస్ చేస్తుందని మొదటి నుంచి ప్రశ్నిస్తూ వస్తోన్న ఆర్టీసి జేఏసి నేతలు తాజాగా ఇదే విషయమై ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును మొరపెట్టుకున్నారు. ఆర్టీసీ జేఏసి నేతల ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బీసి కమిషన్.. తెలంగాణ సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీచేసింది. మీ ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని బీసీ కమిషన్ వారిని ఆదేశించింది. ఈ నెల 25న పూర్తి నివేదికతో ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరుకావాలని కమిషన్ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
    
కార్మికుల్లో 20 వేలకు పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని ఈ సందర్భంగా కార్మికులు జాతీయ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా వారంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున.. జాతీయ బీసీ కమిషన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా కార్మికులు తమ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.


ఇదిలావుంటే, ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు ఆదేశించగా.. తాజాగా జాతీయ బీసీ కమిషన్ నుంచి సైతం ఈ విషయంలో నోటీసులు అందడం ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆర్టీసి సమ్మెకు మొదటి నుంచి మద్దతు పలుకుతున్న విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.