తెలంగాణకు కేంద్రమంత్రి గడ్కరీ వరాల జల్లు
కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు
హైదరాబాద్: కేంద్ర రోడ్డురవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. శనివారం రాష్ట్రంలో కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి 5 వేల 550 కోట్ల నిధులిస్తామని చెప్పారు. గోదావరిపై జలరవాణా మార్గానికి 2 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అంబర్‌పేట, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో చేపట్టబోయే రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామన్న గడ్కరీ.. మోదీ హయాంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఎన్నో నిధులిచ్చామని గుర్తుచేశారు.
ఇక నీటిపారుదల రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గడ్కరీ అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి చెప్పారని అన్నారు. ప్రాజెక్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని గుర్తుచేసిన ఆయన.. త్వరలోనే కాళేశ్వరానికి వస్తానని చెప్పారు. 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వీటిని వాడుకోవాలంటే గోదావరిపై రెండు డ్యామ్‌ల నిర్మాణం అవసరమన్నారు. కాలుష్యం కంట్రోల్ చేయడానికి నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్‌తో నడిచే ఆటోరిక్షాలు, బస్సులను ప్రోత్సహించాలని చెప్పారు.
రోడ్లవిస్తరణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వాహన కాలుష్య నియంత్రణపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవలసి ఉందని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ జనాభా ఇప్పటికే కోటి దాటినందున శాటిలైట్ టౌన్‌షిప్‌లై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు, పాత జాతీయ రహదారుల విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ప్రతిపాదనలను ఆమోదించి నిధులు మంజూరు చేయడంతో పాటుగా త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తామని గడ్కరీ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.