Old Man Protest Against Sarpanch: తన ఇంటికి వెళ్లే రహదారిని జేసీబితో మూసి వేసి తాను ఇంటికి, బయటికి వెళ్లే మార్గం లేకుండా చేసి స్థానిక సర్పంచి దౌర్జన్యం చేస్తున్నాడని నిరసిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య అనే 75 ఏళ్ల వృద్దుడు జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డుతో నిరసనకు దిగాడు. గతంలో గ్రామంలో తన ఇంటికి వెళ్లేందుకు 12 అడుల వెడల్పుతో ఒక రహదారి ఉండేదని.. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఆ రహదారిని గ్రామ సర్పంచ్ మూసి వేసి ఇంటికి వెళ్లటానికి ఇబ్బందులు సృష్టించాడని ఆ వృద్దుడు వాపోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రామ సర్పంచ్ వైఖరిపై ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు తన గోడు పట్టించుకోకుండా సర్పంచ్ కే ఒత్తాసు పలుకుతూ తన ఫిర్యాదును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ వృద్ధుడు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డు మెడలో వేసుకుని ఆందోళన చేపట్టాడు. ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలుసుకుని తన సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు. మెడలో ప్లకార్డు వేసుకుని ఆందోళనకు దిగిన వృద్ధుడిని గమనించిన అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు.. వెంటనే అతడితి చేయుతనందించి కలెక్టరేట్ లోపల ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న హాలులోకి తీసుకెళ్లారు. 


అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో దుర్గా మాధురిని కలిసి తన గోడు వెల్లబోసుకున్న మల్లయ్య.. అధికారుల చుట్టు తిరిగిన పట్టించుకోవటం లేదని.. కనీసం మీరు అయినా న్యాయం చేయాలని ఆర్డీవోను వేడుకున్నాడు. మల్లయ్య అనే ఆ వృద్ధుడి ఫిర్యాదును విచారణకు స్వీకరించిన జిల్లా కలెక్టర్.. బాధితుడికి న్యాయం చేయాల్సిందిగా ఆదేశిస్తూ మల్యాల సీఐకి ఈ ఫిర్యాదును ఫార్వార్డ్ చేశారు.