భద్రాద్రి కొత్తగూడెం: బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి చచ్చి మళ్లీ పుడుతుందంటుంటారు. ఒక తల్లి ప్రసవ వేధన అలాంటిది. కానీ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్న ఈ గర్భిణికి ( Pregnant woman ) ఆస్పత్రికి చేరుకోవడంలోనే పురిటినొప్పుల కంటే ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి. ఇంట్లో నుంచి ఆస్పత్రికి చేరుకోవడం పురిటినొప్పులను మించిన ప్రసవవేధనకు గురిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Bhadradri Kothagudem district ) గుండాల మండలం నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమతకు శుక్రవారం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ని పిలిపించారు. కానీ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ( Heavy rain ) మార్గం మధ్యలో పొంగి ప్రవహిస్తున్న మల్లన్న వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన అప్పటికే కొట్టుకుపోయింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊరు దాటాలంటే.. వాగు దాటాల్సిందే.. వాగు దాటాలంటే.. ఆ నీటి ప్రవాహంలోంచి నడిచి వెళ్లాల్సిందే. మరోవైపు నిండుచూలాలు ఆ నీటి ప్రవాహాన్ని దాటే పరిస్థితి లేదు. దీంతో కుటుంబసభ్యులే ఆమెను ఇలా భుజాలపై ఎత్తుకెళ్లి వాగు దాటించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆమె క్షేమంగా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం గర్భిణి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ఇది మమత ఒక్కరి కష్టం కాదు.. ఇటీవల వాగుపై బ్రిడ్జి కొట్టుకుపోయిన అనంతరం అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టం.