Hyderabad's Pregnant woman died in ambulance, what led the hospitals to deny admission: హైదరాబాద్: గర్భిణికి చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కి చెందిన పావని అనే గర్భిణిని కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్సు‌లోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. తన బిడ్డ పావనిని (Pregnant Pavani), పావని కడుపులో ఉన్న పసికందును ప్రాణాలతో కాపాడుకునేందుకు పావని తల్లి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిండు గర్భిణి అయిన తన బిడ్డ తన కళ్ల ముందే కళ్లుమూసిన వైనాన్ని చూసి తట్టుకోలేక దుఖసాగరంలో మునిగిన ఆ తల్లిని కొన్ని గంటల వ్యవధిలోనే మరో కష్టం వెంటాడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గర్భిణి అయిన పావనిని ఖననం చేసేందుకు మల్లాపూర్ స్మశానవాటికకు తీసుకెళ్లగా.. పసికందు చనిపోయినప్పటికీ ఇలా గర్భంలో ఉండగా అంత్యక్రియలు చేయలేం అంటూ స్మశానవాటికలో పనిచేసేవాళ్లు నిరాకరించారు. ఆఖరికి బిడ్డ పావని శవానికి అంత్యక్రియల్లోనూ నిరాకరణే ఎదురవడం ఆ తల్లిని మరింత కృంగదీసింది. అయినప్పటికీ ఆ కష్టంలోనూ ఆమె పావని మృతదేహంలోంచి శస్త్రచికిత్స ద్వారా పసికందు శవాన్ని వేరుచేయించేందుకు మరోసారి ధైర్యాన్నంతా కూడగట్టుకుని మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఈసారి శవానికి శస్త్రచికిత్స కుదరదని చెప్పడంతో ఆఖరికి ఏం చేయాలో అర్థంకాని నిస్సహాయ పరిస్థితుల్లో పావని మృతదేహం తీసుకుని ఆ తల్లి తిరిగి ఇంటికే చేరుకుంది.


Also read : Pregnant dies in ambulance: అంబులెన్స్‌లోనే గర్భిణి మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం


ఆరోజు అసలేం జరిగింది ? స్థానిక ఆస్పత్రులు ఎందుకు పావనిని చేర్చుకునేందుకు నిరాకరించాయి ?
నిండు గర్భిణి అయిన పావని మల్లాపూర్‌లోని సూర్యనగర్ కాలనీలో ఉండే స్థానిక పీహెచ్‌సీలోనే రెగ్యులర్‌గా తన హెల్త్ చెకప్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పీహెచ్‌సీలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నందున తాజాగా గురువారం నాడు మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు ప్రసూతి ఆస్పత్రికి (Private maternity hospital) తీసుకెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో ఉమ్మ నీరు తక్కువగా ఉందని చెప్పి సెలైన్ ఎక్కించి పంపించారు. 


ఇదిలావుండగా శుక్రవారం తెల్లవారుజామునే పావని ఆయాసంతో బాధపడుతుండటంతో ఆమె తల్లి తన బిడ్డను మరోసారి అంతకు ముందు రోజు చూపించిన ప్రైవేటు ప్రసూతి ఆస్పత్రికే తీసుకెళ్లారు. అయితే, పావనిది కొవిడ్-19 పాజిటివ్ కేసు అయ్యుంటుందని (COVID-19 positive case) అని అనుమానించిన సదరు ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించినట్టు పావని తల్లి తెలిపారు. తరచుగా ఇక్కడికే వస్తున్నామని, ఈసారి కూడా ఇక్కడే వైద్యం అందించాలని పావని తల్లి ఎంత వేడుకున్నా వారు పట్టించుకోలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడే ఉన్న మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


కరోనా కారణంగా అందుబాటులో లేని గైనకాలజిస్ట్, సర్జన్..


అప్పటికే సమయం ఉదయం 7 గంటలు అవుతోంది. పావనిని తమ ఆస్పత్రికి తీసుకొచ్చింది మొదలు.. ఆస్పత్రిలో ఏం జరిగిందనే వివరాలను అక్కడి ఆస్పత్రి ఎండీ స్వయంగా జీ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. '' పావనిని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు స్వయంగా అక్కడే ఉన్న తాను.. ఆమె ఆయాసంతో బాధపడుతుండటం గమనించి వెంటనే ఆక్సీజన్ సాచ్యురేషన్ లెవెల్స్ పరిశీలించాను. అప్పుడు ఆమె Spo2 లెవెల్స్ 40 గా చూపించింది. పావని ప్రాణాపాయ స్థితిలో ఉందని అర్థమవడంతో వెంటనే పావనికి ఆక్సీజన్ అందించే ఏర్పాట్లు పూర్తి చేశాను. ఆ తర్వాత ఆమె ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్ 60కి చేరుకున్నాయి. అయినప్పటికీ ఆందోళనకరమైన పరిస్థితే. తమ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నందున పావనిని చేర్చుకోవడానికి తనకు ఏ అభ్యంతరం లేదు కానీ పావని విషయంలోనే ఆమెది భిన్నమైన పరిస్థితి. ఒకవేళ పావనిది కరోనా పాజిటివ్ అయినా ఆమెకు చికిత్స అందించేందుకు తాము వెనుకాడే ప్రసక్తే లేదు కానీ.. అప్పటికే ఆమె నిండు గర్భిణి కావడం, కరోనా కారణంగా గైనికాలజిస్ట్, సర్జన్స్ అందుబాటులో లేకపోవడంతో చికిత్స అందించలేని పరిస్థితి. అదే విషయం వారికి చెప్పాను'' అని సదరు ఆస్పత్రి ఎండీ జీ మీడియాకు తెలిపారు. దీంతో పావని తల్లి ఆమెను అంబులెన్సులో ఎక్కించుకుని లక్డీకపూల్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆస్పత్రిలో పావనికి చికిత్స అందించే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి ఎల్బీనగర్‌లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. 


Also read : Goa Danger Bells: గోవాలో కొనసాగుతున్న మరణ మృదంగం, ఆక్సిజన్ కొరతే కారణం


అప్పటికే పావని పరిస్థితి చేయిదాటిపోతోంది. పావని పరిస్థితి చూసిన ఎల్బీనగర్‌లోని రెండు ఆస్పత్రుల వైద్యులు.. ఆమెని కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి కానీ లేదా గాంధీ ఆసుపత్రికి కానీ తరలించాల్సిందిగా పావని తల్లికి సూచించారు. బిడ్డను, బిడ్డ కడుపులో ఉన్న మరో పసి ప్రాణాన్ని కాపాడుకునేందుకు పావని తల్లి ఆ నిండు గర్భిణిని తీసుకుని అంబులెన్సులో కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి పరుగులు తీశారు. అప్పటికే చావుబతుకుల మధ్య పెద్ద యుద్ధమే చేసిన పావని ఇక పోరాడలేనంటూ మార్గం మధ్యలో అంబులెన్సులోనే తుదిశ్వాస విడిచింది (Pregnant died in ambulance). 


అలా జరిగి ఉంటే పావని బతికి ఉండేది..
డెలివరీ కోసం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులు జోగారావు, నీలవేణిల ఇంటికొచ్చిన పావనిని ఆమె తల్లిదండ్రులు మొదట స్థానిక పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించారు. అలా ఒకట్రెండుసార్లు పావనిని స్థానిక పీహెచ్‌సీకే తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు... ప్రస్తుతం పీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ (COVID-19 Vaccination in Telangana) నిర్వహిస్తున్నందున అక్కడ పరిస్థితులు బాగోలేవని పావనిని ఈసారి మల్లాపూర్‌లోనే కేవలం ప్రసూతి వైద్యానికే పరిమితమైన మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలా శుక్రవారం నాడు కూడా ఆయాసంతో బాధపడుతున్న పావనిని అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


గురువారం పావనికి వైద్యం చేసిన అదే ప్రైవేటు ప్రసూతి ఆస్పత్రి.. శుక్రవారం పావని ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్ (Things to know about Oxygen levels) పడిపోవడం చూసి ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. ప్రసూతి ఆస్పత్రే (Maternity hospital) స్వయంగా పావనిని వెనక్కి పంపించిన తర్వాతే ఆమె చావుతో అసలైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒకవేళ అక్కడే పావనికి అక్కడే తక్షణ వైద్య సహాయం అంది ఉంటే ఆ తల్లి బిడ్డా ఇద్దరూ బతికి ఉండేవాళ్లేమో!!


Also read : COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు


తప్పు ఎవరిది ? 
కరోనాతో కాలం గడపవట్టి ఏడాది దాటింది. ఏడాది కాలంగా కరోనా మధ్యే గర్భిణీలకు జరుగుతున్న చికిత్సలు, అందుతున్న వైద్య సహాయం అటు ఆస్పత్రులను, ఇటు గర్బిణిలను తెలియని భయాందోళనలకు గురిచేస్తున్నాయని జనం అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడం వల్ల ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు పావనికి ఎదురైన ఇబ్బందులే ఎదురవతున్న దాఖలాలు లేకపోలేదని.... కానీ వెలుగులోకి వచ్చేది కొన్నేనని జనం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


కరోనా కాలంలో గర్భిణీలకు (Pregnancy during Corona pandemic) ఇబ్బందులు లేకుండా సర్కారు వైపు నుంచే ప్రత్యేక వైద్య సహాయం అందించే విషయంపై సర్కారు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పావని ఉదంతం వెలుగెత్తి చాటిందని చెబుతున్న పబ్లిక్... ఇప్పటికైనా పావని ఉదంతంతో సర్కారు మేల్కొవాల్సిన అవసరం ఉందంటున్నారు. సర్కారు ఏమీ చేయనప్పుడు ప్రైవేటు ఆస్పత్రులను నిందించే హక్కు కూడా లేనట్టేనని పావని ఉదంతం చూసినవాళ్లు అభిప్రాయపడుతున్నారు. పావని ఘటన తర్వాతైనా మన బంగారు తెలంగాణలో బంగారు తల్లులను కాపాడుకునేందుకు సర్కారే చొరవ తీసుకోవాలని పబ్లిక్ వేడుకుంటున్నారు. ప్రజల అవసరాలను తీర్చడమే తమ పని అని చెబుతూ వస్తోన్న ప్రభుత్వం ఈ ఘటనపై ఎలా స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.


Also read: COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook