10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కొంత మంది టీచర్లు జవాబు చిట్టీలు అందిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొడిమ్యల్ మండల కేంద్రంలోని కొడిమ్యల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉదయం మ్యాథమెటిక్స్ పేపర్ II పరీక్ష రాస్తున్న విద్యార్థులకు టీచర్లే చిట్టీలు అందిస్తున్నట్టుగా స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలలో తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రం నుంచి వాట్సాప్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రం అందుకున్న కొంతమంది టీచర్లు పరీక్ష కేంద్రానికి పక్కనే ఆనుకుని వున్న ఓ గది నుంచి జవాబు చిట్టీలు అందిస్తున్న ట్టు తెలుస్తోంది. మఫ్టీలో ఆ గదిలోకి వెళ్లిన పోలీసు సిబ్బందిని పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ గౌడ్ బయటికి గెంటేయగా.. ఈలోగా మిగతా టీచర్లు అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. 


ముగ్గురు ఉపాధ్యాయురాళ్లు సహా మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినట్టు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ గౌడ్ సహా రమేష్ మరో ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నామని, మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.