తమ వ్యాపార సంస్థపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అతడు తన ఆరోపణలను ఉపసంహరించుకోని పక్షంలో అతడిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడానికైనా తమ సంస్థ సిద్ధంగా ఉందని ఈవెంట్స్ నౌ అనే ఈ-కామర్స్ సంస్థ ఇవాళ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, అతడికి ఈ-కామర్స్ కంపెనీల పని తీరుపై ఏ మాత్రం అవగాహన లేదన్న విషయం స్పష్టమవుతోందని, చట్టబద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఒక వాణిజ్య సంస్థపై రేవంత్ చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని ఈవెంట్స్ నౌ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ కార్యక్రమాలకు టికెటింగ్ వ్యాపారం నిర్వహించడం, ఆ కార్యక్రమాలను సొంతంగా నిర్వహించడం రెండూ వేర్వేరు వ్యాపారాలన్న కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించడం అర్థరహితం అని సందర్భంగా ఈవెంట్స్ నౌ రేవంత్ రెడ్డికి హితవు పలికింది. రేవంత్ రెడ్డి ఆరోపించినట్టుగా ప్రస్తుతం జరుగుతున్న సెన్సెషన్ కార్యక్రమానికి, ఈవెంట్స్ నౌ సంస్థకి ఎలాంటి సంబంధం లేదని సంస్థ తేల్చిచెప్పింది. 


కేవలం టీఆర్ఎస్ నేత కేటీఆర్‌‌కి బంధువైన రాజ్ పాకాలకు చెందిన సంస్థ అయినంత మాత్రాన్నే ఈవెంట్స్ నౌపై రాజకీయ ప్రయోజనాల కోసం బురద జల్లే ప్రయత్నం సరికాదని, ఇకనైనా రేవంత్ రెడ్డి తన ఆరోపణలు ఉపసంహరించుకుని సంస్థకు క్షమాపణలు చెప్పకుంటే, ఆ తర్వాతి పరిణామాలు ఎదుర్కోవడానికి అతడు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఈవెంట్స్ నౌ హెచ్చరించింది. ఈవెంట్స్ నౌ చేసిన ఈ హెచ్చరికలపై రేవంత్ రెడ్డి ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!