Revanth Reddy Padayatra: బీఆర్ఎస్లో చేరిన ఆ 12 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Padayatra: హాత్ సే హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ` పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు.
Revanth Reddy Padayatra: పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రజా కోర్టులో ఉరి తీయాలి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 5వ రోజు కామేపల్లి మండలం లచ్చతండా నుంచి కొత్తలింగాల వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొత్త లింగాలలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాద యాత్రకు హాజరైన వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణా సమాజంపై ఉందని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కోసం నేను రాహుల్ గాంధీతో కోట్లాడి టికెట్ ఇప్పించాను. అయిన మరొకరి ఒత్తిడితో పార్టీ మారింది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ఈ 12 మందిని ప్రజా కోర్టులో ఉరి తీసినా తప్పులేదు పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఆగ్రహం వెళ్లగక్కారు.
నిజంగా కేసీఆర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ భావిస్తే.. ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలి. మీరు అభిమానంతో మీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. వాళ్లు దొరగారి గడీలో గడ్డి తినేందుకు వెళ్లారు. పార్టీ మారిన తర్వాత వారికి చేకూర్చిన లాభాలు, లావాదేవీలపై కూడా విచారణ చేయాలి. అలా చేయకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ కేసీఆర్‌కు లొంగిపోయినట్లే అని భావించాల్సి ఉంటుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నకిలీ వితనాల్లా.. తెలంగాణ రాజకీయాల్లో నకిలీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అంటూ రాజకీయ నేతల ద్వంద వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ ఫిరాయించిన ఆ 12 మంది ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టాలి. శాశ్వతంగా ఓడించి రాజకీయంగా బొంద పెట్టాలి " అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లాలో అయిదు సార్లు ఓటమి ఎరుగని నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి. అందరికీ సహకరించిన గొప్ప నాయకుడు. ప్రజలకు సేవలందించేందుకు రాంరెడ్డి సోదరులు తమ జీవితాలను పణంగా పెట్టారు. అటువంటి నాయకుడు అనారోగ్యంతో మరణిస్తే వారి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని మేమందరం అడిగితే కాదని సిగ్గు లేకుండా పోటీ పెట్టిన దరిద్రుడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేసే మంచి సాంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఉప ఎన్నికలో అభ్యర్థిని పెట్టి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని అవమానించిన నీచుడు ఈ ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అందుకే వెంకట్ రెడ్డి ఆత్మ క్షోభించి కేసీఆర్‌ను వెంటాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడేలా చేసింది. పాదయాత్ర మార్గం మధ్యలో భూక్య రమేష్ కుటుంబాన్ని కలిశాను. సాయుధ దళాల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తూ రమేష్ మరణించాడు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం. ఆత్తామామలను విడిచి బయటికి వెళ్లని పరిస్థితి రమేష్ భార్యది. గొప్పలు మాట్లాడే కేసీఆర్‌కి రమేష్ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత లేదా ? కల్నల్ సంతోష్ బాబు భార్యకు ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా గిరిజనుడైన భూక్యా రమేష్ కుటుంబాన్ని ఎందుకు ఆదుకోరని ఆయన ప్రశ్నించారు.
పాదయాత్రలో పొన్నెకల్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాచేస్తూ కనిపించారు. న్యూయార్క్‌లోనైనా కరెంట్ పోతుందేమో కానీ తెలంగాణలో కరెంట్ పోదు అన్న సన్నాసి దీనికి ఏం సమాధానం చెప్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలపై రైతులు రోడ్డెక్కుతున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే చేసింది. 9 గంటలు పగటి పూట నాణ్యమైన విద్యుత్ ను అందించింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 2004 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 24 గంటలపాటు కరెంట్ ఇవ్వడం కేసీఆర్ వల్ల కాదు. విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయాల అప్పుల్లో ఉన్నాయి. ఇందులో సర్కార్ చెల్లించాల్సినవే 28 వేల కోట్ల రూపాయలు. విద్యుత్ సంస్థలు త్వరలో మునిగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో మరో బషీర్‌బాగ్ తరహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కలిసి రావాల్సిందిగా కమ్యూనిస్టు మిత్రులను కూడా కోరుతున్నా అని రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతంలో 29 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 23 మంది గిరిజనులే. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన పాపానికి రైతులకు బేడీలు వేసిన ఘటన రైతులు మరచిపోలేదు. అందుకు కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. రైతులకు లక్ష రుణమాఫీ చేయలేదు. ఇటువంటి కల్వకుంట్ల రాజ్యాన్ని ఖతం చేసి ప్రజా రాజ్యాన్ని నిర్మించుకుందాం. జనవరి 1, 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదలకు రూ.5లక్షలు అందిస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఏ అవకాశం ఉన్నా... రాంరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. జనవరి 26, 2024 బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం శిలాఫలకం వేసే బాధ్యత మాది. బయ్యారం ఉక్కు కర్మాగారంతో వేలాది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులపై రేవంత్ రెడ్డి హామీల వర్షం కురిపించారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KTR: నేను రెడి.. నువ్వు రెడినా ? కేటీఆర్‌కి రేవంత్ రెడ్డి సవాల్..
ఇది కూడా చదవండి : Asaduddin Owasi: తాజ్ మహల్ కంటే అందంగా కొత్త సెక్రటేరియట్.. లోపల మసీదు నిర్మాణం
ఇది కూడా చదవండి : Revanth Reddy Challenges KCR: రేవంత్ రెడ్డి నోట మళ్లీ అదే మాట.. ప్రభుత్వానికి అదే సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook