RS Praveen Kumar: ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar to contest from sirpur constituency: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే ఎన్నికల్లో కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సిర్పూర్ - కాగజ్ నగర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామని పేర్కొన్నారు.
RS Praveen Kumar to contest from sirpur constituency: సిర్పూర్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు, కాంట్రాక్టర్లు, కబ్జాదారులు, గుండాగిరి చేస్తూ కబలిస్తున్నారన్నారు. బిల్లులు తీసుకుంటున్నారు కానీ పనులు చేయడం లేదని అందెల్లి బ్రిడ్జి నిర్మించి ప్రారంభం కూడా కాకుండానే కూలిందని తెలిపారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు 13 రకాల రాయితీలు ఇచ్చినట్టే ఇచ్చి లాభాలన్ని మింగుతున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి అధిక జీతమిచ్చి స్థానికులకు తక్కువ జీతాలిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ మిల్ యాజమాన్యంతో ఎమ్మెల్యే కోనప్ప కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఎమ్మెల్యే కోనప్ప అనుచరులు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి అధికారులపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని నోటిఫైడ్ భూములు,ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు చెలిమెలు తోడుకొని నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రాంతాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు, ఇతర పథకాలు ఏవీ అందడం లేదని తెలిపారు. గతంలో బిఎస్పి పార్టీ నుండి కోనప్పను గెలిపిస్తే మహనీయులను, బహుజనులను మోసం చేసి దొరలతో కలిసారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించి కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చి, బలవంతంగా పాదాభిషేకం చేయించుకున్నారని తెలిపారు.
బిజెపి ప్రభుత్వంకు చెందిన నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఆదివాసులపై మూత్ర విసర్జన చేశారని, అందుకే ఆదివాసులు బిజెపికి ఓటేయొద్దన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, పేదల అభిప్రాయాలను పట్టించుకోకుండా వారిని గౌరవించకుండా భిన్నత్వాన్ని ధ్వంసం చేస్తూ ఉమ్మడి పౌరస్మ్రుతి చట్టాన్ని తెస్తున్నారని అందుకే మైనారిటీలు, బహుజనులం అందరం కలిసి బిజెపిని తెలంగాణకు రానివ్వద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
మణిపూర్‌లో కూకి జాతికి చెందిన క్రైస్తవులను 220 మందిని బిజెపి పొట్టనపెట్టుకున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలపైనే ఉపా చట్టం పెట్టి బెదిరిస్తుందని, ఆధిపత్య వర్గాలపై ఎందుకు ఈ కేసును నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం సిర్పూర్ ప్రాంతంలోని మాలి కులస్థులను ఎస్సీ జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. కానీ బహుజన రాజ్యంలో ఖచ్చితంగా మాలిలను ఎస్సీ జాబితాలో కలుపుతామని హామి ఇచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గాన్ని దేశంలో అత్యుత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కోనప్ప ఆగడాలపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి : RS Praveen Kumar : టెన్త్ పేపర్ లీక్‌పై ఉన్న శ్రద్ధ.. TSPSC పేపర్ లీక్‌లపై ఎందుకు లేదు
కేసిఆర్, కోనప్ప కలిసి ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం 1951లో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజీనామా చేసిన పత్రాన్ని మాయం చేసిందని, అలాంటి పార్టీకి బిఆర్ఎస్ సహకరిస్తుందని అందుకే ఈ రెండు పార్టీలను ఓడించాలని సిర్పూర్ ఓటర్లకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మొత్తానికి తాను రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నాను అనే విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. ఇది కూడా చదవండి : PM Modi Tour In Warangal: విశ్వాస ఘాతకుడు కేసీఆర్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు: ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK