హైదరాబాద్‌ : తెలంగాణలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ఒక రోజు తగ్గిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వాస్తవానికి ప్రస్తుత విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలువుగా ఉండగా.. తాజాగా ఆ సెలవులను 12వ తేదీ నుంచి 16వ తేదీకి ఖరారు చేస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఇటీవల టిఎస్ఆర్టీసీ సమ్మె చేపట్టిన సమయంలో బస్సు సౌకర్యాలు లేని కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు పొడిగించిన సెలవులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ వరకు ప్రతీ నెల రెండో శనివారాన్ని పని దినంగా పరిగణించాల్సి ఉంటుందని అప్పట్లోనే సర్కార్ ఓ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ఈ నెల 11న రెండో శనివారం అవుతుండటంతో ఆ రోజు నుంచే ఇవ్వాల్సి ఉన్న సంక్రాంతి సెలవులను సర్కార్ మరొక రోజుకు పొడిగించింది. ఇక ఇంటర్‌ కాలేజీల విషయానికొస్తే.. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను మంజూరు చేస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ ఉమర్‌ జలీల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఇదిలావుంటే, విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను సర్కార్ పాటించకపోవడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు తప్పుపట్టాయి. ఈ మేరకు యూటీఎఫ్‌ (UTF), పీఆర్టీయూ (PRTU), ఎస్టీయూ (STU), టీటీయూ (TTU), టీటీఎఫ్‌ (TTF), టీపీయూఎస్‌ (TPUS), టీఎస్టీయూ (TSTU), ఎస్జీటీయూ (SGTU), టీఎస్‌పీటీఏ (TSPTA), ఎస్జీటీ ఫోరం (SGT forum) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..