మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు వైసీపీలో కీలక పదవి !!
టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవలె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సి.రామచంద్రయ్యకు వైసీపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సి.రామచంద్రయ్య సేవలను వినియెగించుకోవాలని భావించే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు జగన్ పేర్కొన్నారు.
1981లో రాజకీయ ఆరంగేట్రం చేసిన సి.రామంద్రయ్య 1985లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన 1986-88 కాలంలో రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా టీడీపీలో ఎన్నో పదవులను అలంకరించిన సి.రామంద్రయ్య.. కీలకమైన టీడీపీ పోలిట్ బ్యూరో కూడా సభ్యుడిగా కొనసాగారు. రాజకీయ కారణాల వల్ల 2008లో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో నెంబర్ టూ గా కొనసాగారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెలో విలీనం కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కిరణ్ కేబినెట్ లో చోటు ఇచ్చారు. ఇలా రెండో పర్యాయం ఆయన మంత్రి పదవిలో కొనసాగారు.
అయితే రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ కనుమురుగు అయింది. దీంతో వేరే ప్రత్యామ్నాయం లేకపోవంతో రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవలె టీడీపీ-కాంగ్రెస్ పొత్తును విభేదిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సి.రామచంద్రయ్య వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు