తెలంగాణ టీడీపీ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చి నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న టీడీపీ పార్టీశ్రేణులు టీఆర్‌ఎస్‌లో కలిస్తేనే మంచిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలు టీడీపీకి రోజు రోజుకు దూరమవుతున్నారని.. ఈక్రమంలో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరమని కొందరు అనే మాటలు బాధ కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా పార్టీని సరైన పంథాలో నడిపేవారు తెలంగాణలో కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలలో కూడా ఆత్మస్థైర్యం కొరవడుతుందని.. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలు, ఓటర్ల తీర్పును కూడా గౌరవించాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న మంత్రులందరూ టీడీపీ నుండి వలస వెళ్లినవారేనని.. అలాంటప్పడు టీడీపీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. 


టీడీపీ గౌరవంగా పార్టీ అంతరించిపోయే స్థాయికి చేరకముందు... కేసీఆర్‌ని ఒక మిత్రుడుగా భావించి పార్టీని టీఆర్‌ఎస్‌లో కలిపేస్తే ఎలాంటి వివాదాలు ఉండనవి ఆయన తెలిపారు. ఒకవేళ చంద్రబాబుకి పార్టీ విలీనం పట్ల ఆసక్తి లేకపోతే.. ఆయనే స్వయంగా తెలంగాణ మొత్తం తిరిగి పార్టీ ఉనికిని కాపాడాలని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.