హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా చెల్లించలేదనే సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ వద్ద కేవలం రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని... ఆర్టీసీ కార్మికుల జీతాలు చెల్లించడానికి మొత్తం రూ. 224 కోట్లు కావాలని కోర్టుకు తెలిపారు. 


అక్టోబర్ 5న ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకుంది. 19న చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మె మరింత అధృతరూపం దాల్చింది. ప్రభుత్వం వైఖరి మారి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు తాము సమ్మెను విరమించే ప్రసక్తే లేదని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.