KCR, Jagan skips Amit Shah meeting: దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో కీలకమైన సదరన్ మీటింగ్‌కి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ డుమ్మా కొట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి విజయన్ హాజరవగా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు లైట్ తీసుకుంటున్నట్టు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో తిరువనంతపురంలో శనివారం జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరు కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. తెలంగాణ తరపున ప్రభుత్వ ప్రతినిధిగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నిర్వహించే ఈ సమావేశానికి తొలి ప్రాధాన్యతగా ముఖ్యమంత్రులను, కేంద్రపాలిత ప్రాంతాల నుండి లెఫ్టినెంట్ గవర్నర్లను ఆహ్వానిస్తారు. ఈ కారణంగానే తమిళనాడు నుండి సీఎం స్టాలిన్, కేరళ నుండి సీఎం పినరయి విజయన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాకుండా తమ ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోని ఇతర ఉన్నతాధికారులను పంపించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తరపున ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం ఇదేం మొదిటిసారి కాదు.. చివరిసారిగా గతేడాది నవంబర్ 14న తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సైతం కేసీఆర్ హాజరవలేదు. అప్పుడు కూడా హోంమంత్రి మహమూద్ అలీనే తెలంగాణ ప్రతినిధిగా హాజరయ్యారు. 


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా పెండింగులోనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సి ఉన్న నిధులు, జాతీయ సంస్థలు ఏళ్ల తరబడి పెండింగ్ పడుతూ వస్తున్నాయంటున్నారు. తరచుగా ఈ ఆరోపణలు చేస్తోంది ఎవరో కాదు.. స్వయంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే వీలు చిక్కినప్పుడల్లా కేంద్రానికి మొరపెట్టుకుంటున్న అంశం ఇది. మరీ ముఖ్యంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశం ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కొంత ఆచీతూచీ వ్యవహరిస్తున్నప్పటికీ.. సమస్యల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రంపై ఒంటికాలుపై లేస్తున్నారు. అలాంటప్పుడు తమ సమస్యలు చెప్పుకునే వేదికలైన ఇలాంటి సమావేశాలకు ముఖ్యమంత్రులు ఎందుకు హాజరవలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.  


సదరన్ జోనల్ కౌన్సిల్‌కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాష్ట్రాలు ఏకరువు పెట్టే సమస్యలపై సమీక్ష కోసం వివిధ విభాగాల్లో కీలక స్థాయిలో ఉండే అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రాలకు రావాల్సి ఉన్న నిధులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అప్పుడప్పుడు ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలుస్తుంటారు. కానీ ఒకరకంగా చెప్పాలంటే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కూడా అలాంటి సమస్యలు చెప్పుకునేందుకు వేదిక లాంటిదే. రాష్ట్రంలోని సమస్యలే కాకుండా రాష్ట్రాల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చకొస్తుంటాయి. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య తరచుగా ఘర్షణపూరిత వాతావరణానికి కారణయ్యే నదీ జలాలు, నీటి పంపకాల సమస్యలు కూడా ఇక్కడ చర్చకొస్తాయి. అపాయిట్మెంట్ తీసుకుని మరి ఢిల్లీ వరకు వెళ్లి తమ గోడు చెప్పుకునే ముఖ్యమంత్రులు.. మరి దక్షిణాదిన జరిగే సమావేశాలకు ఎందుకు వెళ్లరు ? అంత కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టే ముఖ్యమంత్రులు.. ఇక అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్రంపై విమర్శలు చేయడం మాత్రం ఎందుకని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 


తమ ప్రభుత్వం తరపున మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు కదా అని ముఖ్యమంత్రులు సరిపెట్టుకోవచ్చునేమో కానీ.. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నా, రాష్ట్రాల్లోని పరిస్థితిని కేంద్రానికి వివరించాలనే తపన ఏమాత్రం ఉన్నా.. స్వయంగా ముఖ్యమంత్రులే వెళ్లి సమస్యలు చెప్పుకోవడం వేరు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read : TSPSC AEE, AMVI Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి.. బ్యాడ్ న్యూస్


Also Read : TSPSC AEE Jobs Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి