సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని నియోజకవర్గం చరిత్రలోనే ఇంతకుముందెప్పుడూ లేనిరీతిలో భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్‌నగర్ ఓటర్లు అందించిన విజయం తమకు మరింత ఉత్సాహాన్నించిందన్న కేసీఆర్.. ఈ విజయం ఓటర్లదే అని అన్నారు. శనివారం సాయంత్రం హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్... పార్టీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతూ నియోజకవర్గంపై వరాలు గుప్పించారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వరాల జాబితా:
ప్రతీ గ్రామపంచాయతీకి రూ. 20 లక్షల నిధులు. 
ఒక్కో మండల కేంద్రానికి రూ. 30 లక్షల నిధులు
రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు 
నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు నిధులు.
హుజూర్‌నగర్‌లో కల్వర్టుల నిర్మాణం. 
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు. 
నియోజకవర్గంలో బంజారాభవన్‌ ఏర్పాటు. 
హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో పోడుభూముల సమస్యకు పరిష్కారం. 
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌‌గా గుర్తిస్తామని ప్రకటన. 
నియోజకవర్గంలో న్యాయస్థానం, ఈఎస్‌ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు. 
భారీ సంఖ్యలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు.