Telangana Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2కు గ్రహణం, మళ్లీ వాయిదా పడనున్న పరీక్షలు
Telangana Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రేపటిలోగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడవచ్చు. విద్యార్ధుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Group 2 Exams: తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వరుసగా జూలై, ఆగస్టు నెలల్లో షెడ్యూల్ కావడంతో అభ్యర్ధులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. రెండింటికీ సిద్ధమయ్యే అభ్యర్ధులు దేనికి ప్రిపేర్ కావాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలనే డిమాండ్ కొద్దిరోజులుగా విన్పిస్తోంది.
తెలంగాణలో 783 పోస్టులతో టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటఫికేషన్ ప్రకారం గత ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకూ దరఖాస్తులు స్వీకరించారు. దాదాపుగా 5.51 లక్లలమంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 6,7 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు అప్పట్లో గురుకుల నియామక పరీక్షల కారణంగా విద్యార్ధుల డిమాండ్ మేరకు నవంబర్ 2, 3 తేదీలకు రీషెడ్యూల్ అయింది. అయితే నవంబర్ 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జనవరి 6,7 కు వాయిదా పడింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మార్చ్ నెలకు వాయిదా వేసింది. కానీ తేదీ ప్రకటించలేదు. తాజాగా ఆగస్టు నెలలో నిర్వహిద్దామనుకుంటే జూలైలో జరిగే డీఎస్సీ పరీక్షలు అడ్డొస్తున్నాయి. దాంతో మరోసారి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని వాయిదా వేయడంతో పాటు పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తోంది. గ్రూప్ 2 పోస్టుల్ని 2 వేలకు గ్రూప్ 3 పోస్టుల్ని 3 వేలకు పెంచాలనేది ప్రధాన డిమాండ్. అటు డీఎస్సీ కూడా 25 వేల పోస్టులతో ప్రకటించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ, ఆగస్టు 6,7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడంపై వస్తున్న వ్యతిరేకతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్న గ్రూప్ 2 పరీక్షల్ని మరోసారి వాయిదా వేయవచ్చని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook