దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తోన్న రాష్ట్రం తెలంగాణ : సీఎం కేసీఆర్
దేశంలోనే అత్యధిక మొత్తంలో జీతభత్యాలు చెల్లిస్తోన్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అని అన్నారు సీఎం కేసీఆర్.
దేశంలోనే అత్యధిక మొత్తంలో జీతభత్యాలు చెల్లిస్తోన్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత నాలుగేళ్లలో తెలంగాణలో 224 శాతం మూల ధనం పెట్టుబడి పెరిగింది అని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో తాజాగా సభ్యులని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ ఈ వివరాలను సభకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 24 గంటలపాటు విద్యుత్ కోతలు లేకుండా వెలుగులతో విరాజిల్లుతోంది. దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టంచేశారు. ఒకప్పటిలా రాష్ట్ర సచివాలయంలో పనుల కోసం వెళ్లిన వారిని అవినీతి పట్టి పీడించడం లేదు అని ముఖ్యమంత్రి సభలో గర్వంగా ప్రకటించారు.
వివిధ అభివృద్ధి సూచికల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో వుంది. దేశంలో తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం అధికంగా వుంది. పారిశ్రామిక అభివృద్ధి రేటు, పెట్టుబడులు, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో తెలంగాణ అగ్ర భాగాన వుందని సీఎం సభలో వెల్లడించారు.