విజయదశమి పర్వదినం ముగిశాక టీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటించనున్నట్లు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తాము పలు అంశాలను మేనిఫెస్టోలో పెడుతున్నామని.. ముఖ్యంగా ఏకకాలంలో రుణమాఫీ చేసే విషయంతో పాటు నిరుద్యోగ భృతి మొదలైన విషయాలు కూడా తమ ఎజెండాలో ఉన్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా పలు విమర్శలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐటీ దాడులనేవి జరగడం సహజమని.. ఆదాయపన్ను శాఖ వారు వారి  పని వారు చేస్తుంటారని.. ఆ విషయంలో ఏపీ సీఎం స్పందించడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, మస్తాన్ రావు మొదలైన వారి ఇండ్ల పై దాడులు జరుగుతుంటే.. చంద్రబాబు ఎందుకు స్పందిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు వేయడానికి ప్రయత్నించినా.. రాబోయే ఎన్నికల్లో తమకు తమ పార్టీపైనా.. ప్రజల పైనా పూర్తిస్థాయి నమ్మకం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 


అదేవిధంగా, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నికలలో నిల్చోలేదని.. కాబట్టి ఆయన బల బలాల గురించి తాను కామెంట్ చేయనని కేటీఆర్ అన్నారు. అలాగే చంద్రబాబు గురించి మాట్లాడుతూ... ఓటుకి నోటు విషయంలో దొరికిపోయినా చంద్రబాబు మారలేదని.. తెలంగాణలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టినా సరే.. ఎవరూ తెలంగాణలో తమ పార్టీకి ఎదురు నిలవలేరని.. ప్రజలకు ఎవరికి పట్టం కట్టాలో తెలుసని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.