హైదరాబాద్: పంట సాగు కోసం దుక్కి దున్ని వరుణుడి కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త వినిపించింది. యావత్ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నైరుతి రుతుపవనాలు నేడు లేదా రేపటి శనివారం రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, అంతకన్నా ముందుగా ఇవాళ నైరుతి రుతుపవనాలు ఏపీలో విస్తరించనున్నాయి. ఆ తర్వాతే తెలంగాణను తాకనున్న నైరుతి.. రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయు తుఫాన్ కారణంగానే రుతుపవనాల రాక ఆలస్యమైందని అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైరుతి రాకతో ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుండగా ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్త రు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు నిజామాబాద్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం వడగాడ్పులు వీయొచ్చని అధికారులు హెచ్చరించారు.


ఇదిలావుంటే గురువారమే తెలంగాణలోని 16 జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి వాగులు పొంగిపొర్లాయి.