హైదరాబాద్: రోజుకో ప్రకటనతో బీజేపీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ రైతులను మభ్య పెడుతున్నారని తెరాసకు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ప్రాంతీయ కార్యాలయంతో సరిపెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు పేరుతో అర్వింద్ రైతులను మోసం చేశారని, బోర్డు ఏర్పాటు చేయించలేకపోయిన ధర్మపురి అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుండి నిజామాబాద్ జిల్లా రైతులను డీ శ్రీనివాస్ మోసం చేస్తూ వచ్చారని అన్నారు. ఇప్పుడు మరోసారి అర్వింద్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. 


పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, లేదంటే రాజీనామా చేసే వరకు రైతులు అర్వింద్ ను నిలదీయాలని పేర్కొన్నారు. తెలంగాణ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ .. ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సానుభూతి పొందేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని అంటున్నారని, తెలంగాణ ఆకాంక్షను తప్పుబట్టడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..