హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్ ప్రజా తీర్పును చూశాకానైనా.. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలకు ముందు హుజూర్ నగర్‌లో సభను చేపట్టి, ఆ సభకు హాజరు కావాలని ప్రయత్నించినప్పటికీ.. అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించక బహిరంగ సభకు హాజరుకాలేకపోయానని అన్నారు. అందుకే హుజూర్‌నగర్‌లో తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు అక్టోబర్ 26న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. హుజూర్‌నగర్‌లో గెలుపు అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


పార్టీపై, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి సైది రెడ్డిని గెలిపించిన హుజూర్‌నగర్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నూరు శాతం నెరవేరుస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.