ఆర్టీసి సమ్మెలో విషాదం.. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ మృతి
ఆర్టీసి సమ్మెలో విషాదం.. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ మృతి
హైదరాబాద్: ఆర్టీసి కార్మికులకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆదే గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా.. 90 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న అతడిని తొలుత ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోస హైదరాబాద్ డీఆర్డీవోకు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ రెడ్డి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆర్టిసి డ్రైవర్ మృతిపై తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్లే కార్మికుడు చనిపోయాడంటూ ఆర్టీసి కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆస్పత్రి వద్దకు వస్తున్నారు. మరోవైపు శ్రీనివాస రెడ్డి మృతితో ఖమ్మం జిల్లాలోనూ ఆర్టీసి సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసి డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టిన కార్మికులను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.