ఆర్టీసీ సమ్మె: కార్మికులకు పవన్ కల్యాణ్ భరోసా
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాల్సిందిగా కోరుతూ కార్మిక సంఘాల నేతలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. విధి నిర్వహణలో వారు ఎదుర్కున్న కష్టాలు, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర, ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలు, తెలంగాణ సర్కార్ వైఖరి వంటి అంశాలను కార్మిక సంఘాల జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి.. పవన్‌కి వివరించారు. కార్మిక సంఘాలు చేస్తోన్న న్యాయపోరాటానికి మద్దతు పలకాల్సిందిగా ఈ సందర్భంగా వారు పవన్ కల్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల విజ్ఞప్తిపై స్పందించిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇది కేవలం 48వేల మంది కార్మికుల సమస్య కాదని, ఆర్టీసీ సేవలు అందుకునే యావత్ సామాన్య ప్రజల సమస్య అని అన్నారు. తనకు అందుబాటులో ఉన్న వనరుల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరి ఆయనను కలిసి సమస్య తీవ్రతను వివరిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకని పక్షంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను కలిసి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 16 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేసిన పవన్ కల్యాణ్.. కష్టాలు ఎక్కువకాలం ఉండవని, కార్మికులు అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు.