BJP VS TRS:  సెప్టెంబర్ 17. తెలంగాణ ప్రాంతానికి ఈ రోజుతో అవినాభావ సంబంధం ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ యూనియన్ లో అప్పటి తెలంగాణ స్టేట్ కలిసిపోయిన రోజు సెప్టెంబర్ 17. అయితే సెప్టెంబర్ 17న జరిపే వేడుకలపై మొదటి నుంచి వివాదమే. విమోచన దినమని కొందరు.. విలీనమని ఇంకొందరు.. విద్రోహమని మరి కొందరు వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో  రాష్ట్ర సాధనలో కలిసిపోయిన పార్టీలు.. సెప్టెంబర్ 17 విషయంలో మాత్రం భిన్న ధృవాలుగానే ఉండిపోయాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి నుంచి సెప్టెంబర్ ను విమోచన దినంగా పాటిస్తూ.. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది బీజేపీ. నిజాం పాలన అంతమైన రోజంటూ ఘనంగా సంబరాలు చేసుకుంటుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ , టీడీపీ పార్టీలు మాత్రం విలీన దినోత్సవంగా జరుపుకునేవి. వామపక్షాలు మాత్రం సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా జరుపుకుంటాయి. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేసేది. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. కాని గత ఎనిమిది ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. సెప్టెంబర్ 17న అధికారికంగా వేడుకలు జరపడం లేదు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జెండా కార్యక్రమాలు చేపడుతున్నా అధికారికంగా మాత్రం నిర్వహించడం లేదు. కేసీఆర్ తీరుపై బీజేపీ ఆగ్రహం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం తమకు కలిసివచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా సెప్టెంబర్ 17 సెంటిమెంట్ ను తమ అస్త్రంగా మలుచుకుంటోంది కమలదళం.


సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ ఈసారి నేరుగా రంగంలోకి దిగింది. కేంద్ర సర్కారే అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకలకు కేంద్ర బలగాలను వినియోగించనుంది. వేడుకలు హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కేంద్ర బలగాల గౌరవ వందన స్వీకరించనున్నారు. కేంద్ర సర్కార్ నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు గతంలో తెలంగాణ స్టేట్ లో అంతర్భాగంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను సైతం బీజేపీ ఆహ్వానిస్తోంది. దీన్ని బట్టే తెలంగాణ విమోచన దినోత్సవంపై బీజేపీ ఎంత సీరియస్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండదని భావిస్తున్న కేంద్రం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. బీజేపీ దూకుడుతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. కేంద్ర సర్కార్ తీరుపై విపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.


తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు అధికారికంగా నిర్వహించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయం అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతుందని తెలుస్తోంది. దీంతో కమలం పార్టీకి కౌంటర్ ప్లాన్ టీఆర్ఎస్ సిద్ధం చేస్తుందని సమాచారం. కేబినెట్ సమావేశంతో పాటు పార్టీ లెజిస్టేచర్ పార్టీ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు స్పష్టించేలా బీజేపీ వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే గత ఎనిమిది ఏళ్లుగా ఎందుకు జరపలేదని నిలదీస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి.. ఓట్ల కోసమే చిల్లర రాజకీయం చేస్తుందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా కమలం పార్టీ తీరుపై భగ్గుమంటున్నారు. కమ్యూనిస్టులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలంగాణలో చిచ్చు పెట్టేలా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.


మరోవైపు  తెలంగాణ విమోచన వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానించి కొత్త వివాదానికి ఆజ్యం పోస్తున్నారని అంటున్నారు. గతంలో తెలంగాణతో కలిసిఉన్న ప్రాంతాలను మళ్లీ తెలంగాణతో కలుపుతారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న కేంద్ర సర్కార్ నిర్ణయం తెలంగాణలో కాక రేపుతోంది. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. 


Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?


Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి