Kishan Reddy On Dharani Portal: ధరణి పేరుతో ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూ సమస్యలకు సర్వరోగ నివారణిగా తెచ్చిన ధరణి పోర్టల్​తో భూ సమస్యలు తగ్గకపోగా పెరిగాయని అన్నారు. ధరణి సమస్యలను ఒకప్పటిలా స్థానిక అధికారులు తీర్చలేని పరిస్థితి ఉందని.. ధరణితో ప్రజలు, రైతులు అనేక రకాల కొత్త భూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ధరణి సమస్యలపై దాదాపు 10 లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పాసు పుస్తకాల్లో నమోదైన తప్పులను సరిదిద్దడానికి సరైన ఆప్షన్లు, మాడ్యూల్స్​ లేవని అన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్​ ఆఫీస్‌ లో మీడియాతో ఆయన మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నిమిషాల వ్యవధిలో మ్యూటేషన్​ జరుగుతుందని.. అంతా పారదర్శకంగా ఉంటుందని, అవీనితి, అక్రమాలు ఉండవని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గతం కంటే భూ సమస్యలు పెరిగాయి. ఎలాంటి లిటిగేషన్​ లేని ల్యాండ్‌ను ధరణి పోర్టల్​లో ప్రొహిబిటెడ్​ లిస్టు​లో పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ధరణి మార్పులు చేర్పులు పూర్తిగా ప్రగతి భవన్​ చేతిలో పెట్టుకున్నారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే భూ సమస్యలు.. ఇవాళ ప్రగతి భవన్​ చేతిలో ఉంది. ధరణి పేరుతో అక్రమాలు, దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.


ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. వేలాది ఎకరాల భూములను బినామీ కంపెనీలకు, రియలెస్టేట్​ అనుచరులకు దోచి పెట్టడం వాస్తవం కాదా..?. ధరణి ప్రజల కోసం కాదు.. ప్రభుత్వంలో ఉన్న గులాభీ నాయకుల కోసం తెచ్చినట్లుంది. ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్​ వ్యాపారులు కుమ్మక్కై.. భూములను ప్లాట్లుగా మార్చి హైదరాబాద్​ చుట్టు పక్కల విక్రయిస్తున్నారు. ధరణి సమస్యలతో భూ హక్కు పత్రాలు లేక రైతులు రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం పొందలేకపోతున్నారు. ధరణి బ్రోకర్లను పెంచి పోషిస్తున్నట్లు న్యాయస్థానాలు వ్యాఖ్యానిస్తున్నాయి.  


రాత్రుళ్లు భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. తెల్లవారి సరికి ఆ భూములను ప్రొహిబిషన్​ లిస్టు​లో పెడ్తున్నారు. ధరణి లాకింగ్​, అన్‌లాకింగ్​ ప్రగతి భవన్‌​లో ఉందా..? ఎవరి చేతిలో ఉంది..? భూ సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే .. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి. ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​ వద్ద ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. సమస్యలపై రైతులు పెట్టుకునే దరఖాస్తులకు ఫీజులు చెల్లించడం దారుణం. ఒకవైపు భూమి కోల్పోయి.. మరోవైపు ఫీజులు చెల్లించలేక అన్నదాతలు ఇబ్బంది పడతున్నారు. ధరణి కారణంగా ఏ కుటుంబంలో చూసినా.. ఏ గ్రామంలో చూసినా భూ తగాదాలు పెరుగుతున్నాయి. ధరణి అంతా బాగుంటే.. క్యాబినెట్​ సబ్​ కమిటీ ఎందుకు వేశారు..?' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏముంది..? ప్రభుత్వం దానిపై ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రం మంత్రి. ధరణి భూ సమస్యలు అప్లికేషన్లు, వాటి స్టేటస్​ వివరాలు బహిర్గతం చేయాలని అన్నారు. ప్రభుత్వం వాటిని ఎందుకు దాస్తున్నది..? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల నివాస స్థలాలకు సంబంధించిన స్వమిత్వ పథకం ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో 90 శాతం భూములు ప్రభుత్వ గుర్తింపులో లేవని అన్నారు. స్వమిత్ పథకం ద్వారా గుర్తింపు వస్తే.. దాంతో బ్యాంకు రుణాలు తీసుకొని పేదలు ప్రయోజనం పొందే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి బెడ్​ రూమ్‌​లో బుల్లెట్​ ప్రూఫ్​ గ్లాసులు పెట్టుకుంటారని.. ప్రజల రక్షణ గురించి పట్టించుకోరని అన్నారు.


Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 


Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి