కలెక్టర్ ఆమ్రపాలికి షాక్ ఇచ్చిన వరంగల్ కోర్టు
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ జిల్లా కోర్టు అనుకోని షాక్ ఇచ్చింది.
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ జిల్లా కోర్టు అనుకోని షాక్ ఇచ్చింది. ఐసీడీఎస్ కార్యాలయం కోసం వినియోగిస్తున్న ప్రైవేటు భవనానికి ప్రభుత్వం తరపున అద్దె చెల్లించడంలో జాప్యం చేస్తున్నందుకుగాను ఆమె వాహనాన్ని జప్తు చేయాల్సిందిగా సీనియర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం కోసం తన భవనాన్ని అద్దెకి తీసుకున్న అధికారులు గత రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, బకాయిల విషయమై తాను జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి వరంగల్ జిల్లా కోర్టుని ఆశ్రయించాడు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సి వున్న రూ.3 లక్షల బకాయిలని ఇప్పించాల్సిందిగా కృష్ణా రెడ్డి కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నాడు.
కృష్ణా రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీనియర్ సివిల్ జడ్జి.. బాధితుడి పట్ల జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బాధితుడికి అద్దె బకాయిలు చెల్లించే వరకు కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాల్సిందిగా సంబంధిత అధికారులని ఆదేశించారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే కలెక్టర్ వాహనం తిరిగి ఇవ్వాల్సిందిగా జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆమ్రపాలి ఫార్చునర్ కారుని జప్తు చేసుకునేందుకు కోర్టు సిబ్బంది వరంగల్ జిల్లా కలెక్టరేట్‌కి చేరుకున్నారు.