Telangana Cabinet: మైనార్టీ కోటాలో మంత్రి ఎవరో..? రేసులో ఆ ముగ్గురు నేతలు..!
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్‌లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Telangana Cabinet Expansion: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మంత్రి వర్గ కూర్పులో.. శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు. సీఎంతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సామాజిక లెక్కలు పరిగణలోకి తీసుకుని కేబినెట్‌లో చోటు కల్పించినా.. మైనారిటీలకు మాత్రం ఇంకా అవకాశం ఇవ్వలేదు. మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండటంతో మిగిలిన సామాజిక వర్గాలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఇప్పటికే అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలోనే మైనారిటీలలో ఎవరికి మంత్రి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత 20 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా.. గతంలో యూపీలోని మురదాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం ఉంది. సీనియర్ నాయకుడిగా ఉన్న అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. కేబినెట్‌లోకి తీసుకోవాలని ఆయన వర్గం కోరుతోంది. కాగా.. అజహరుద్దీన్‌తోపాటు సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి వర్గంలో చోటు ఆశిస్తున్నారు.
షబ్బీర్ అలీ గతంలోనే మంత్రిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనను ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎంపీగా ఢిల్లీకి వెళితే.. ఆయన అనుభవం పార్టీకి జాతీయ స్థాయిలో ఉపయోగపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
నాంపల్లి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే యువ నాయకుడిగా ఉన్న ఫిరోజ్ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రి అప్పగించడం కష్టమేనని సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. ఏదైనా కార్పొరేషన్ పదవిని ఫిరోజ్ ఖాన్‌కు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ ముగ్గురు నేతల్లో మాజీ ఎంపీ అజహరుద్దీన్ మంత్రి పదవి రేసులో కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు గ్రేటర్ ఓట్లు కూడా కీలకం కానున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీలను ఆకర్షించేందుకు అజహరుద్దీన్‌కు ఛాన్స్ ఇవ్వచ్చని సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తేలిపోనుంది.
Also Read: Ind-vs-SA: భారత్-దక్షిణాఫ్రికా చివరి టీ20 నేడే, సిరీస్ సమం అవుతుందా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి